ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ టూరిజం శాఖ, Indian Association of Tour Operators (ఐఏటీవో) మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఐఏటీవో వార్షిక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగానికి చెందిన ప్రముఖులతో పాటు అంతర్జాతీయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు అనుగుణంగానే ఐఏటీవోతో భాగస్వామ్యం ఏర్పడిందన్నారు. 41వ ఐఏటీవో వార్షిక సదస్సుకు Visakhapatnam ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖలో జరిగే ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలోని బీచ్‌లు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి సౌందర్య ప్రాంతాలు, వారసత్వ సంపద వంటి పర్యాటక విశేషాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందనున్నాయని తెలిపారు.
ఈ ఒప్పందం ద్వారా విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుందని మంత్రి దుర్గేశ్ వివరించారు. సెప్టెంబర్‌లో జరగనున్న సదస్సుకు దాదాపు వెయ్యి మంది అంతర్జాతీయ టూరిజం ప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
స్థానిక టూర్ ఆపరేటర్లకు ప్రోత్సాహంగా ఐఏటీవో సభ్యత్వ నమోదు ఫీజులో 50 శాతం ప్రత్యేక రాయితీ కల్పించడంతో పాటు, రూ.10 వేల జాయినింగ్ ఫీజును పూర్తిగా మినహాయించినట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పర్యాటక రంగంలో ఇప్పటికే రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరగడంతో రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు. ఈ సదస్సు జాతీయ ట్రావెల్ ట్రేడ్, పర్యాటక రంగ అగ్రనేతల సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైవిధ్యభరితమైన పర్యాటక అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే అరుదైన వేదికగా నిలవనుందని ఆయన అభిప్రాయపడ్డారు.