ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం రోజుకు 18 గంటలు శ్రమిస్తుంటే, బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంగళవారం జిల్లాలోని చిల్పూర్ మండలం పల్లగుట్టలో పర్యటించిన ఆయన, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.

అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు?" అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని ప్రజల చేతిలో పెట్టాల్సిన వారు ఖాళీ చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. పేదలకు చేరాల్సిన నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని విమర్శించారు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపడం లేదని భట్టి స్పష్టం చేశారు. ఇప్పటివరకు 76 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు. "కేంద్రం వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదు?" అని ప్రశ్నించిన భట్టి.. కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడే పరిస్థితిని కేంద్రం తీసుకొస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వడ్లతో పాటు మొక్కజొన్నను కూడా కొనుగోలు చేస్తోందని చెప్పారు.

ఉచిత విద్యుత్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో డిస్కమ్‌లకు బకాయిలు చెల్లించలేదని, కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని భట్టి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ, ఆ ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఒకప్పుడు వలసల ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుతం అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. అలాగే రఘునాథపల్లిలో 230 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుపై పరిశీలన చేపడతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.