విశాఖపట్నంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం పరామర్శించారు. ఉదయం కిమ్స్‌కు చేరుకున్న ఆయన, తీవ్రంగా గాయపడిన కార్మికులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్, అవసరమైన అత్యుత్తమ చికిత్స అందించాలని సూచించారు. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉప ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్నారు.