విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం జరిగిన భారీ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ మంగళవారం విశాఖపట్నం చేరుకుని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని బాధితుల నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వారి వెన్నంటి నిలబడేందుకే ఆస్పత్రికి వచ్చామని తెలిపారు. ప్రమాదం కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడంలో ప్రజలు, కార్మిక సంఘాలు చేసిన పోరాటం కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే విచారణ కమిటీని నియమించిందని, ఆ కమిటీ నివేదిక అందిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చింతకాయల విజయ్ తదితరులు మంత్రి లోకేశ్ వెంట ఉన్నారు.