తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డి.కే. అరుణ తీవ్రస్థాయిలో స్పందించారు. ఏబీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సీఎం వైఖరిని తప్పుబడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, రాష్ట్రంలో ఎవరైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉందని డీకే అరుణ స్పష్టం చేశారు. తమను తెలంగాణలో తిరగనివ్వమని చెప్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. అవసరమైతే తామూ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
పదవిలోకి రాకముందు రాజకీయాలు అవసరం లేదని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం ప్రతిరోజూ రాజకీయాలే చేస్తున్నారని ఆమె విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వంతో విభేదించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయంగా నష్టపోయారని, అదే విధంగా కేంద్రంతో అనవసరంగా తలపడితే రేవంత్ రెడ్డికి కూడా ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని హెచ్చరించారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోదీ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ సీఎం చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తెలంగాణలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు కోరినా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధులు లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని డీకే అరుణ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర సహకారంతోనే ప్రభుత్వం నడుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.