బిహార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బాధితులకు సాయం అందేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీకి బయలుదేరిన ఈ బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గాయపడినట్లు తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు బిహార్ ప్రభుత్వంతో సమన్వయం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రమాదం నుంచి బయటపడిన యాత్రికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఏపీ అధికారులు బిహార్ ఉన్నతాధికారులు, స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని గయాలోని అనుగ్రహ నారాయణ మగధ్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్‌కు కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. యాత్రికులను స్వస్థలాలకు తరలించే అంశంపై కూడా బిహార్ ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి.