పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో నేడు ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పర్యటించనున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు, పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఉదయం 11 గంటలకు సిద్ధాంతం గ్రామానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి, ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శిస్తారు. అక్కడ ప్రదర్శించిన ఆధునిక వ్యవసాయ పరికరాలు, సాంకేతికతలను పరిశీలించిన అనంతరం బహిరంగ సభలో రైతు లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
ఆ తర్వాత రైతులను ఉద్దేశించి ప్రసంగించే సీఎం, సభ ముగిసిన వెంటనే నేరుగా పొలాల్లోకి వెళ్లి పంటల పరిస్థితి, సాగునీటి లభ్యతను పరిశీలించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వారితో చర్చించనున్నారు.
అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గంలోని రాజకీయ, స్థానిక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలతో ప్రత్యేక ఫొటోషూట్‌లో కూడా పాల్గొని వారిని ఉత్సాహపరచనున్నారు. పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరనున్నారు.
వృద్ధుడి వీడియోపై స్పందించిన సీఎం
పెనుగొండ మండలం రామన్నపాలెం శివారు కామధేనువు లంకకు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ చంద్రబాబును కలవాలనే తన కోరికను వీడియో ద్వారా వ్యక్తం చేశారు.
“ఆ మహానుభావుడిని దూరం నుంచి ‘చంద్రబాబు గారూ’ అని మొక్కుతా.. ఆయన రెండు చేతులూ ఊపుతారు. అది చాలు” అని వృద్ధుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు తన అధికారిక ఎక్స్ ఖాతాలో, “సత్యనారాయణ గారూ... మనం రేపు సిద్ధాంతంలో కలుద్దాం!” అంటూ స్పందించారు. దీంతో వృద్ధుడి కోరిక నెరవేరబోతోందనే ఆనందం కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతోంది.