స్వర్ణాల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు. భక్తులకు మౌలిక వసతుల కల్పన.

నెల్లూరులో జరిగే ప్రసిద్ధ రొట్టెల పండుగను పురస్కరించుకుని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాల చెరువు సమీపంలో భక్తుల కోసం ముందస్తు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. చెరువు పరిసరాల్లో టైల్స్ ఏర్పాటు, గుర్రపుడెక్క తొలగింపు, తాత్కాలిక షెడ్ల నిర్మాణం, టాయిలెట్ల మరమ్మతు పనులను అధికారులు ప్రారంభించారు. ఈ పనులను టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి పఠాన్ సాబీర్ ఖాన్, ఎన్ఎంసీ ఏఈ ఫజిల్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సాబీర్ ఖాన్ మాట్లాడుతూ, ఈ ఏడాది రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం నాణ్యమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచించారని చెప్పారు.

వారి మార్గదర్శకాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేస్తున్నామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని సాబీర్ ఖాన్ స్పష్టం చేశారు. రొట్టెల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.