ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖతో పాటు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. తాజా పరిస్థితులపై గురువారం స్పందించిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు.
రానున్న మూడు గంటల్లో కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, రైతులు పొలాల్లో పని చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.